rss
twitter
    Find out what I'm doing, Follow Me :)

Sunday, January 31, 2010

ఎదురు జల్లు...

అప్పటిదాకా ఎక్కడున్నాయో
నువ్వు మలుపు తిరిగేసరికి
ఊడిపడ్డాయి.. వెచ్చగా..
-*-

చూసినంత సేపూ రాని నువ్వు
అటు తిరిగేసరికి ప్రత్యక్షం..
తెలిస్తే ఎప్పుడో తిరిగే వాడిని.
-*-

కిటికీ లోనుంచి నీకోసం చూస్తూ
అందరూ నీలానే కనిపిస్తారు
దగ్గరకొచ్చేదాకా..
-*-

ఆరుబయట నేను..
గోడమీద కాలానికి
కీ ఇవ్వడం మరిచానేమో..
-*-

ఎంత చూసినా...
అక్కడి వరకే.. ఈ చూపులు..
మలుపు తిరిగితే బాగుణ్ణు.
-*-

ప్రతి శబ్దంలో
అడుగుల అలికిడి వెదకలేక
చెవులూ అలుస్తున్నాయి..
-*-

చెవులకి చేరిన చేతి డొప్ప..
శ్వాసనాపి ..ఆకుల అలజడిని
ఆపోశన పడుతోంది.

గొడుగు.........



వానలెన్ని చూసిందో
ఎన్ని ఎండల కాగిందో
బలహీన మయిన బొమికలతో
బేలగా చూస్తుంది..

కానీ ఆ ముఖం మీద
రంగు పూలు మాత్రం
పొడుచుకున్న పచ్చలా
శాశ్వతంగా పలుకరిస్తున్నాయి

కరుకు కాలం
ఎన్ని కరిగించలేదు ?
చిరుగాలి కూడా.. ఇప్పుడు
తనని కృంగదీస్తుంది..
కణుపులిరిగిన చేతిలా
వ్రేలాడ దీస్తుంది.

ఈ వానలో.. మట్టి ముద్దగా
మిగిలిన నేను..
తలదాచుకోవాలనే ఈ పరుగు..

తనతల నేను దాచుకోవడానికో.. ?
నా తల తనలో దాచుకోవడానికో.. ?
పారుతున్న కాలమే సాక్షి !!

ఉదయం............



నిశ్శబ్దపు అంచులమీదకు
జారిన నిప్పు కణికలు
ఆవిరై అలుపు రేపాయి !

రెప్ప బరువు లేపలేని ఆద
చీకట్లో కరిగి ఈకల్లోకింకుతూ..
ఎంత సమయం మింగిందో!

తూర్పు కొండలు కృంగిన శబ్దాన్ని
ఆకు సందులు చిలకరించే సరికి..
ముళ్ళకంప మీద ఎర్ర గులాబీలు
బద్ధకంగా పూశాయి..

అటుప్రక్క వాలు చూడని ఆశ,
వద్దన్నా.. నడినెత్తికెగబాకుతుంది.

కలవని చూపులు...........



చూపులు కలిసే లోపే
తెరలు దిగిపోతాయి..
వంతెనలు కరిగి పోతాయి..
ఊసులు వెనుతిరిగి వస్తాయి..

మరో ప్రయత్నం
మరింత బలంగా..
అసంకల్పితంగా..
మొదలవుతుంది..
తీరం చేరే అలల్లా..

ఈ రెప్పల సమరమెప్పటిదాకా ?

తలలు తిప్పుకున్న ప్రతిసారీ
గుండెలు పిండే అనుభూతి..
నన్ను చూస్తున్నావన్న
అదో తృప్తి.

అదే ఇంధనంగా..
మళ్ళీ రెప్పలు లేస్తాయి
తిరుగుతున్న తలనాపడానికో ..
జారుతున్న రెప్పలనడగడానికో ..

జారిపోయిన అల..
మరో సారి తీరం వైపు ఎగురుతుంది.
తిరిగి మరలడానికి.

ఏకాంతం.......





నీడనూ వదిలి
చీకట్లో.. ఒంటరిగా..
నిండిన దొప్పలతో..
నేనూ..

నిశ్శబ్దంలో..
మిణుగురులనేరుకుంటూ..
అలసి కీచురాళ్ళయిన
నా ఆలోచనలూ..

బరువెక్కిన రెప్పల మధ్య,
నిశిరాతిరిలో నిశ్శబ్దంగా..
బందీలయ్యాము..

మెలకువొచ్చేసరికి
రంగులద్దుకున్న రాత్రి
నీడతోడిచ్చి ..
బండ మెడనగట్టి
దారి నడవమంది.

పిలుపు.............


చెరిగిన బొట్టునెవరో
తిరిగి దిద్దినట్టనిపించింది

గుడిలో గంట
మరల మ్రోగినట్టనిపించింది

మెలికలు తిరిగిన నడక
అదిరి ఆగి నిలిచిన లేడి
నిలకడగా.. కదిలినట్టనిపించింది

రెప్ప తెంచుకుని
మనసు భారాన్ని మోసుకుంటూ..
తలుపులు బిగిసిన గమ్యానికి
తలను మూర్కుని తనువు చాలించినే
చూపులు.. ఈసారి పూసినట్టనిపించింది.

నీ పిలుపుతో.. చెలీ..
శవం బ్రతికినట్టనిపించింది..
శిల కరిగినట్టనిపించింది.

వానా వానా...

            



నల్ల మబ్బు నీటి చెంగు నేల తడుపుకెళ్ళుతుంటె
పిల్లగాళ్ళు దాని క్రింద చిందులేస్తు చేరినారు..

గాలీ వాన జట్టుగట్టి పరుగు పందెమాడుతుంటె
తాత మనసు కుర్చి నొదిలి వాటితోడు ఉరికిపాయె.

నేలజేరు చినుకులన్ని వీధులెంట పరుగులెట్టి
వెంటనున్న మబ్బునిప్పి, విడిది చేసె తడవకుండ...

ఒళ్ళుతడిసి వణుకుతున్న చెట్ల సేద తీరునట్లు
వెదురుపొదల ఈలపాట సాగుతుంది గాలి లాగ.

వాన నాప పురిని విప్పి అడ్డుకున్న నెమలి గారి
ఈక తడిసి తోకముడిచి చెట్టుక్రింద చేర చూసి,

చుట్టుతిరిగి చూరు చేరు పిచ్చికమ్మ ఆపలేక
తలను తీసి రెక్కలోన దాచి పెట్టి నవ్వుకుంది !!

తోడు.......




గుర్తుకొస్తుంది..
నీ చెక్కిళ్ళ తడిలో
రగిలిన బడబాగ్ని..
కాగితమెక్కడం..

మరువలేనుగా..
చెలమ ఒడ్డున మొలిచిన
చిలిపి మొగ్గలు
మాలలవడం ..

జ్ఞాపకముండిపోదూ..
అడవినడకన
అదిరి ఆగిన అడుగులు
తాళమవడం ..

తలపుకు రావడంలేదూ ..
ఆశ సంధించిన శుభోదయాలూ..
బాధ ముంచిన సాయంకాలాలూ..

ఇవన్నీ..
చిత్తడి అడవిలో..
బెరడు గంధంలా ..
చీకటి పొదల్లో
కీచురాళ్ళ గానంలా ..
అజ్ఞాతంగా..
తాకుతున్నాయి..
జారిపోతున్నాయి..

బ్రతుకు బండి ఆసాంతం ఆపేసి
ఆస్వాదించాలనుంది..
వీటి కోసమైనా..
తిరిగి బ్రతకాలనుంది.

నీతోడు పొందాలనుంది.

ఎవరికోసం .. ?



బరువు దించమంటూ..
రెప్ప జారిన చివరి బొట్టు
ఆర్తనాదం ఎవరికోసం ...

బాధ కాల్చమంటూ
నిట్టూర్పులొదిలిన సెగ
చివరి మూల్గు దేనిఓసం ...

బంధాలు త్రుంచమంటూ
అదిరే పెదవుల అభ్యర్ధన,
ఆత్మ సమర్పణ ఎందుకోసం ...

కురిసి వెలిసిన నింగి వెలితి
మనసు నిండా నింపుకుటూ..
మెరుపు వెలుగులో..
మరో మెరుపుకై తడుముకుంటూ..

చీకటి రాత్రిలో.. గుడ్డి దీపము తోడుగా..
రాని వానకై.. నిరీక్షణ ఎవరికోసం..

ఎవరికోసం .. ?

మౌనం..........

పురిటినొప్పుల్లా తెరలు తెరలుగా
తడిమిన తరుణాలు
మౌనాన్ని ప్రసవించి మరలి పోతాయి

జ్ఞాపకాలు ఆలపించిన గీతాలు
ఎండురెప్పల మధ్య
నిశ్శబ్దంగా దొరిలి పోతాయి

సెలయేటి గలగలలు
ఘనీభవించి గొంతు లోతుల్లో
పదాలు వెదుకుతూ ఉండిపోతాయి

భాష జార్చుకున్న
బరువు భావపు ప్రతి కదలికా
ఏ రంగూ తగలని కవితే..

ఈ కవితా సాగరంలో తేలుతూ నేనూ...

సత్యం........

దొర్లే ఆకుల గుసగుసల్లో..
కొమ్మల్లో చిక్కిన గాలి ఊసుల్లో..
కొండలు పాడే ప్రతి ధ్వనుల్లో..
కొలను చూపే ప్రతి వృత్తములో..
ఎన్ని జీవిత సత్యాలో..

తపన చాలించిన అలల్లో..
తనువు తగిలెళ్ళిన తెమ్మెరల్లో..
తేలిపోతున్న నల్ల మబ్బుల్లో..
తీరమొచ్చిన తెప్ప తనువుల్లో..
ఎన్ని జీవిత సత్యాలో..

నుదుటి కాగితం మీద
కాలం విదిల్చిన అక్షరాలను
కూర్చుకుంటూ..
గుండెలోతుల్లో..
తడవకోకటిగా చెక్కిన చిత్రాలను
సరిపోల్చుకుంటే..

ప్రతి చిత్రం... ఓ సత్యమే !!

కవిత లెప్పుడవుతాయో.......


రెప్ప క్రిందగులాబీ వనంలోరాలిపడినవీ..పారుతున్న ఏటి ధారల్లోఏరుకున్నవీ..వీడని మెళుకువ కీచురాళ్ళతో పాడుకున్నవీ.నిట్టూర్పుల వేడికి ఎండుటాకులై దొర్లుతున్నవీ..ఎన్ని పదాలో ..ఎటుచూసినా పదాలే..ఇవి కవిత లెప్పుడవుతాయో !!?

గమ్యం.......

కనులు మూస్తే….రంగుల చీకటి
కనులు తెరిస్తే…వెలుగుల మబ్బులు
నడచిన కొద్దీ…తరగని దారులు
నేలకున్నట్టి నాలుగు చెరగుల
మనిషికున్నవి తీరని అప్పులు
డబ్బు ఒక్కటే కాదప్పు పదార్ధం
మాట తప్పినా అది తీరని బాకీ
ధర్మము, అర్ధము, కామము, మోక్షము
పురుషార్ధంబుల సాధించుటయే
మనిషి గమ్యమని…మునులు పెద్దలు
ఎంత చెప్పినా…గుండెలు బాదిన
ఈర్షాసూయలు, భయకోపాలు
పట్టిన మనిషిని మార్చుట మాత్రం
కష్ట సాధ్యమే అదేమి చిత్రం
ఉన్నదున్నది ఒక్కటె సూత్రం
పరి పరి విధముల ఆలోచించుట
అతనిని అతనే అభినందించుట
మనసుని ఆపే ధ్యానం చేయుట
తనపై తనకు నమ్మక ముంచుట
మనిషి చేసిన దేవుని రూపం
మార్చలేదురా ఖర్మపు శాపం
జీవితానికి ఎన్నో మెట్టులు
మెట్టు మెట్టు పై ఎన్నో ముల్లులు
ముళ్ళ బాటను దాటాలంటే
ధైర్యపు చెప్పులు వాడాలంతే
కృష్ణుడు, జీసస్, బుద్ధుడు, ప్రవక్త
ఎందరు పుట్టిన, ఎన్ని చెప్పినా
నీకు నువ్వుగా కదిలే వరకూ
బుర్రకు బూజు వదిలే వరకూ
దొరకదు సోదర విజయపు కాంతి
దొరికే వరకు ఉండదు శాంతి
చిన్న నవ్వుతో మనసుల గెలువు
తోటివారికి అండగ నిలువు
గతం కళ్ళకు గంతలు కట్టు
చేసేపనిలో దృష్టిని పెట్టు
భవిషత్ బ్రహ్మవు నీవే ఒట్టు
సంఘపు నీతిని గంగలొ ముంచు
నమ్మితె నీ హృది నిను నడిపించు
పూర్తిగ నమ్మకు ఎవ్వరినైనా
మితృలు ఎవరో, శతృవులెవరో
చెప్పుట కష్టము చివరకు అయినా
నీకు నువ్వుగా భుజం తట్టుకో
నీ ప్రతిబింబం కళ్ళ కద్దుకో
ఒక్కొక్కడుగూ వేస్తూ పోతే
ప్రతీ అడుగుని ఆస్వాదిస్తే
జీవిత మధురిమ విధం తెలిస్తే
ప్రతీ పథంబు గమ్యంబేనని
చుట్టూ ఉన్నది రమ్యంబౌనని
తెలిసిన నాడు ౠషివౌతావు
మరణించాకా జీవిస్తావు.

అదో బాధ...........

నిద్ర పట్టని నన్ను చూసి
నిశీధి ఏడ్చింది
నాకు నిద్ర పట్టలేదని కాదు
తనకి ఏకాంతం దొరకలేదని.

ఎత్తైన ఆలోచన..........

ఆకాశం నుండి చూస్తే గాని భూమి తిరగదు
విత్తు రూపం పోతే గాని మొక్క మొలవదు
ఏదీ కుదురు కాదని తెలియాలంటే ఆలోచనల్లో ఎదగాలి
విజయ తీరం చేరాలంటే నీలోనికి నువ్వు నడవాలి.

కోపం..........

వస్తే కోపం
మారిపోతుంది నీ రూపం
ప్రదర్శిస్తే కలుగుతుంది అనర్ధం
జయిస్తే తెలుస్తుంది జీవిత పరమార్ధం.

చేసి చూసా........

మనసు కదిలించి చూసాను
తలపు కవితయ్యింది
నోరు మెదిలించి చూసాను
పలుకు పాటయ్యింది
తల పైకెత్తి చూసాను
ఆకాశమే ఆలోచనయ్యింది
ఒక ప్రయత్నం చేసి చూసాను
గమ్యం సుగమమయ్యింది.

నేనే ఎందుకని?

మొగ్గ పువ్వునడిగింది
ఇన్ని పువ్వులుండగా
సుగంధంబు వ్యాపించగా
మళ్ళీ నేనెందుకని? నేనే ఎందుకని?

రాలిన పువ్వుకు బదులుగా
తుమ్మెద నెలవుకు వీలుగా
నువ్వు పూయాలని
నువ్వందుకేనని

పిల్లగోవు తల్లిఆవునడిగింది
ఇన్ని ఆవులుండగా
పాలు యేరులై పారగా
మళ్ళీ నేనెందుకని? నేనే ఎందుకని?
పెరిగిన గరికను మేయడానికి
ప్రకృతి సమతుల్యత కాపాడడానికి
నువ్వు పుట్టావని
నువ్వందుకేనని

విత్తు చెట్టునడిగింది
ఇన్ని చెట్టులుండగా
అడవులన్నీ నిండగా
మళ్ళీ నేనెందుకని? నేనే ఎందుకని?
కాలుష్యము కరిగింపగా
ప్రాణవాయువు నివ్వగా
నువ్వెదగాలని
నువ్వందుకేనని
పసిపాప బ్రహ్మనడిగింది
ఇంత జనం ఉండగా
జగతి అంతా నిండగా
మళ్ళీ నేనెందుకని? నేనే ఎందుకని?
వ్యక్తిగా ఎదగడానికి
సమిష్టిగా కదలడానికి
అపర బ్రహ్మగ మారాలని
నువ్వందుకేనని.

మా అమ్మ.........

అమ్మ మనసు:
మొదటిసారి నా ఏడుపు విన్నప్పుడే
వెన్నలాంటి అమ్మ మనసు కరిగిపొయింది
అప్పట్నుంచి ఇప్పటికీ
నేనే అమ్మకు మనసు
అమ్మ కోపం:
నాకు జ్వరమొచ్చి ఏడ్చినప్పుడు
అమ్మకు దేవుడిపై కోపమొచ్చింది
భయపడ్డ దేవుడు
నన్ను ఆడుకోనిచ్చి అమ్మను నవ్వించాడు
అమ్మ నవ్వు:
నేను పెద్దాణ్ణి ఐపొయానని ఎవరో అంటే
మా అమ్మకు నవ్వొచ్చింది
పెద్దాళ్ళంతా మంచాలపై పడుకుంటారట
నాకుమల్లే అమ్మ ఒడిలో కాదట.

ఆవేదన::ఆలోచన........

మతం కోసం మారణకాండలు చేస్తున్నాం
కులం కోసం సమిష్టి విలువలు కూల్చేస్తున్నాం
ప్రాంతం కోసం ప్రాణత్యాగాలు చేస్తున్నాం
వీటన్నింటిని సృష్టించిన మనిషిని మాత్రం చంపేస్తున్నాం
మారదాం…మారుద్దాం
మతం గోల మానేసి మానవత్వం చాటుకుందాం
కులం గోడ కూల్చేసి సమిష్టి బలం పెంచుకుందాం
ప్రాంతం కంటే మనిషి ప్రాణం గొప్పదని తెలుసుకుందాం
చేతిలో చెయ్యేసి అడుగులో అడుగేసి ఒక్క జాతిగా మసలుకుందాం.

చినుకు నేల తాకంగనే……

చినుకు నేల తాకంగనే……
మట్టి మాటు వేచి ఉన్న మొక్క మొలిచింది
చెట్టు చాటు దాగి ఉన్న కోకిల కూసింది
గట్టు మీద ఆగి ఉన్న లేడి గంతులేసింది
ఇన్ని చేసిన చినుకు మళ్ళీ ఆవిరైపోయింది.

నిద్రపోతుంటే..........

అప్పట్లో నిద్రపోతుంటే…..
.
గుండె కొట్టుకుంటుంది
రేపటి భయాల చప్పుడు చేసుకూంటూ
కళ్ళు మూసుకుంటున్నాయి
మనసు ముసుగును మెల్లిగా తీసుకుంటూ
దిండు అణగిపోయింది
ఆలోచనల బరువు తాళలేక
శబ్ధం నిశ్శబ్ధంగా నిద్ర పోయింది
గెలుపు కేక వేయలేని నన్ను చూడలేక
ఇప్పట్లో నిద్రపోతుంటే…..
గుండె కొట్టుకుంటుంది
నేటి ఆనందాల సవ్వడి చేసుకుంటూ
కళ్ళు మూసుకుంటున్నాయి
స్వచ్చమైన మనసుని చూసి ముసి ముసిగా నవ్వుకుంటూ
దిండు అణగిపోయింది
ప్రేమ స్పందనలతోటి కలసి
శబ్ధం నిశ్శబ్ధంగా నిద్ర పోయింది
నా గెలుపు కేకల హోరులో తడిసి అలసి.

నాకు నేను.....

సంతోషం వేసింది
తను వచ్చి ఆనందించి వెళ్ళాడు
దుఃఖం వచ్చింది
తను వచ్చి ఓదార్చి వెళ్ళాడు
ఈలోగా మృత్యువు వచ్చింది
తనూ నాతో పాటు వచ్చేసాడు
ఆందుకే నాకు నేనంటే అంత ఇష్టం.

బాధ.......

ఆమె నా జీవితం లోకి వచ్చేంతవరకూ
గుండెల్లో ఎవరూ లేరే అన్న బాధ
వచ్చాక…తనను నా ప్రేమలో
ముంచెత్త లేకపోతున్నానే అన్న బాధ
నా ప్రేమను తనపై కురిపించినా
తను తీసుకోలేకపోతుందే అన్న బాధ
తను నన్ను వద్దను కున్నప్పుడు
ఎందుకిలా జరిగిందా అన్న బాధ
తను తిరిగి నా దగ్గరకు వచ్చేసినప్పుడు
మళ్ళీ వెళిపోతుందేమోనన్న బాధ
ఇప్పుడు నేను తనని వద్దనుకున్నప్పుడు
మళ్ళీ వచ్చేస్తుందేమోనన్న బాధ
అన్నిటికన్నా మిన్నగా
నాకు నేను దూరమైపోతున్నానేమో అన్న బాధ.

ప్రేమ.......

ప్రేమ ఏది కాదంటే….
మాటల్లోను పాటల్లోను చెప్పెయ్యగలిగితే
నీ చెవులు వాటిని వినెయ్యగలిగితే
అది కాదు ప్రేమ
.
కథల్లోను కవితల్లోను వ్రాసెయ్యగలిగితే
నీ కళ్ళు వాటిని చదివెయ్యగలిగితే
అది కాదు ప్రేమ
.
అమ్మాయి బాగుందని అందంగా నవ్విందని
నీ గుండె లయ తప్పితే
అది కాదు ప్రేమ
మరి ప్రేమంటే…..
ప్రతి మాట పాటలా వినిపిస్తే
అది ప్రేమ
మంచి తప్ప మరేమీ కనిపించకపోతే
అది ప్రేమ
తను నువ్వు ఒక్కటే అనిపిస్తే
అది ప్రేమ
ఇవ్వడమే తప్ప తీసుకోవాలనే కోరిక లేకపోతే
అది ప్రేమ.

భయం........

లేడికి తనని వేటాడే పులి అంటే భయం
గజరాజుకి అంకుశంతో పొడిచే మావటి అంటే భయం
పాముకి తనను తన్నుకు పోయే గ్రద్ద అంటే భయం
మనిషికి మాత్రం తన జీవితాన్నితాను గెలవాలంటే భయం.

కల........

కల నిద్దట్లో పుట్టి
మెలకువతో చెదిరిపోతుంది
కోరి ప్రయత్నిస్తే కల వాస్తవ మవుతుంది
ఎందుకులే అని వదిలేస్తే కాలంతో పాటు కరిగిపోతుంది.

రామతత్వం… కృష్ణగీత....

దైవం ఉన్నా లేకున్నా
నీలోని జీవం మాత్రం సత్యం
నినునడిపేది ప్రకృతి అనుకున్నా
దేవుని ఆకృతి అనుకున్నా
విశ్వ చైతన్యం మాత్రం నిత్యం.

ప్రేయసి.....

ఆకాశంలో మెరుపులు
సిగ్గుపడి మాయమయ్యాయి
నా ప్రేయసి నవ్వులో మెరుపు చూసి
.
జాబిలి ఇంకో జాబిలి ఉందా!
అని విస్తుపోయింది
నా ప్రేయసి వదనపు కాంతి చూసి
.
కలువరేకులు తమ అందాన్ని
తామే తిట్టుకున్నాయి
నా ప్రేయసి నయనాల తీరు చూసి
.
సౌందర్యజలపాతం
సొంపుగా నవ్వింది
నా ప్రేయసి మేను ఒంపు చూసి
.
ముగ్ధమోహన మయూరం
క్రొత్త నడక నేర్చింది
నా ప్రేయసి నడకలో హొయలు చూసి
.
ఝుమ్మంటూ తుమ్మెద
తేనెకోసమొచ్చింది
నా ప్రేయసి శరీర సుగంధం చూసి
.
దేవకాంత ఊర్వశి
తూలి పడిపోయింది
నా ప్రేయసి అణువణువులో ఉన్న సొగసు చూసి.

నా ప్రేయసి ఎవరంటే…

తను నా కళ్ళకు మాత్రమే కనపడే అందాలరాశి
శిల్పి చెక్కిన శిల్పంలా ఉండే సౌందర్యవిలాసి
హరివిల్లునెక్కి హరిణాలతో ఆటలాడు క్రీడోల్లాసి
ఒక్కమాటలో చెప్పాలంటే తన నా ఊహా నివాసి

నీకు నువ్వు తెలుసా?

వ్యవహారానికి లౌక్యం కావాలని తెలుసు
వ్యాపారానికి లొసుగులు తెలియాలని తెలుసు
కూటి కోసం కోటి విద్యలున్నాయని తెలుసు
ఆటలో గెలుపు ఒకరిదేనని తెలుసు
.
నీటిలో రాయి ములుగుతుందని తెలుసు
గూటిలో పిట్ట ఎగురుతుందని తెలుసు
అవతలి వారిలో తప్పులేంటో తెలుసు
ఎవరితో ఎంతవసరమో తెలుసు
.
నిన్నని రమ్మన్నా రాదని తెలుసు
రేపన్నది ఒక నమ్మకమే అని తెలుసు
ఓడితే వచ్చే ఇక్కట్లు తెలుసు
గెలిస్తేనే చప్పట్లని తెలుసు
.
కానీ!
.
ఎంత తెలిసినా ఇంకా ఉందని తెలుసా?
అడుగు వేస్తేగాని పరుగు మొదలవదని తెలుసా?
లోకాన్ని గెలవాలంటే ముందు నిన్ను గెలవాలని తెలుసా?
ఒక్క మాటలో అడగాలంటే నీకు నువ్వు తెలుసా?
.
తెలిస్తే?
.
నీకు నువ్వు తెలిస్తే
గమ్యం స్పష్టమౌతుంది
కష్టం ఇష్టమౌతుంది
మనసు నీ మాట వింటుంది
మృత్యువులో కూడా ఆనందం ఉంటుంది
.
…………….నిన్ను నువ్వు తెలుసుకో…..నీలోని ప్రపంచాన్ని గెలుచుకో.

అలక.....

అమావాస్య చీకటొస్తే
….చందమామ అలిగినట్టు
నల్ల మేఘం అడ్డొస్తే
….నీలాకాశం అలిగినట్టు
తొలి వేకువ పొద్దొస్తే
….తెల్ల కలువ అలిగినట్టు
బుంగమూతి ముద్దొస్తే
….ప్రియురాలు అలిగినట్టు
నా ప్రేయసి పెదాలపై చిలిపి నవ్వొస్తే
..నేనే అలిగినట్టు.

మీది ఏ త్వం?

ఉన్నది అన్నది
………..ఆస్తికత్వం
ఉన్నది అన్నది లేదన్నది
………..నాస్తికత్వం
ఉందో లేదో అన్నది
………..చపలత్వం
ఉంటే ఉంది లేకపోతే లేదన్నది
………..తెలివైన తత్వం
ఉన్నది లేనిది రెండూ నీవే అన్నది
………..వేదాంత తత్వం
ఉన్నదాన్ని వదిలేసి లేనిదాన్ని ఊహించడం
………..భావుకత్వం
లేనిదాన్ని వదిలేసి ఉన్నదాన్ని ప్రేమించడం
………..మానవత్వం.

చీకటి....

వస్తూ ఉంటావు మళ్ళీ వెళిపోతుంటావు
అదేమిటని అడిగితే
జీవితంలో కష్టాలు సుఖాలు
అలానే ఉంటాయని చూపించడానికట
.
దేన్నైనా మింగేస్తావు వెలుగుని తప్ప
ఇదెందుకని అడిగితే
ధైర్యపు దీపం వెలగకపోతే
భయం నిన్ను మింగేస్తుందని చెప్పడానికట
.
తారలు చంద్రుడు నీతోపాటే ఉంటారు
మరి అదెందుకని అడిగితే
కష్టాల్లోను అవకాశపు కాంతులుంటాయని
నిరాశలో ఉన్నవారికి భోదించడానికట
.
అందరినీ నిద్రపుచ్చి నిశ్శబ్ధంగా ఉంటావు
మరి ఇదెందుకని అడిగితే
భావకులు ఏకాంతంగా కూర్చొని
రచనలు చేయడానికట
.
….చుట్టూ చీకటి కమ్మేస్తే..భయం తప్ప మరేమి లేదనిపిస్తే..నీలోనికి నువ్వెళ్ళిపో.

ఒంటరితనం.....

ఏదో చెయ్యాలని ఉన్నా
….ఏం చెయ్యాలో తెలియక
సమస్యేంటో తెలిసినా
….పరిష్కారం పాలుపోక
ప్రపంచంలో ఇంతమందున్నా
….భుజం తట్టే వారు ఒక్కరూ లేక
నీలోనే ఒక నేస్తమున్నా
….తనతో మాట్లాడ బుద్ధికాక
ఓదార్చే చేతుల కోసం
….సేదదీర్చే ఒడి కోసం
బేలగా ఎదురు చూస్తూ
….బాధగా బ్రతుకీడుస్తూ
నిమిషం అనేది నిరాశ రూపం గా కనిపిస్తే
….అది ఆనందానికి అంటరానితనం
దాని పేరే ఒంటరితనం.

చిరునవ్వు.

పలకరింపుకి ముందుంటుంది
పులకరింపులో తానుంటుంది
ప్రతీ మనిషిలో దాగుంటుంది
మనసు కదిలితే మొదలౌతుంది
.
అవతలి మనిషిని గెలవాలంటే
మొదటి సాధనం తానంటుంది
మోముకి అందం తెచ్చేవాటిలొ
తనకు సాటి లేవంటుంది
.
ప్రేమ సేవ భావాలుంటే
వాటిలొ తాను కలిసుంటుంది
ఈర్షాద్వేషం కోపాలంటే
సుదూరంగా పరిగెడుతుంది
.
ప్రేయసి పెదవిపై నాట్యం చేసి
ప్రియుని మనసుని దోచేస్తుంది
ఆకాశంలో అర్ద చంద్రుని
పోటీ పడదాం రమ్మంటుంది
.
కండలు తిరిగిన పురుషులకైనా
ఒంపుల సొంపుల లలనలకైనా
పిల్లలు బామ్మలు తాతలకైనా
ఎవ్వరికైనా ఎప్పుడుఐనా
నిత్య సుగంధపు పువ్వు అది
నిత్యానందపు చిరునవ్వు అది.

ఏకాంతం.......

నీవాళ్ళన్న ప్రతివాళ్ళు నీతోనే ఉన్నా
…..ఒంటరితనానికి అవకాశమే లేకున్నా
నీతో నువ్వు గడపడానికి
…..నీ ప్రేమను నువ్వు పొందడానికి
ఎవ్వరికీ కనపడకుండా
…..వేరెవ్వరి మాటా వినపడకుండా
నీ మనసు గదిలో దూరిపోయి
…..నీవాడిగా నువ్వు మారిపోయి
కనులు మూసుకొని చీకటి అందాన్ని
…..కనులు తెరిచి ప్రకృతిలో ఆనందాన్ని
అనుభవించేలా చేయగలిగే భావనా అయస్కాంతం
…..ఈ ఏకాంతం.